బైంసా లైంగిక దాడి పై డీజీపీ స్పందన…
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైంసాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిపై డీజీపీ స్పందించారు. ఈ అంశంపై జరిగే దర్యాప్తును పర్యవేక్షించాలని పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశంలో పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని గుర్తించి కోర్టులో ప్రవేశ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, నిందితుడికి తగు శిక్ష పడే విధంగా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగాన్ని కోరారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ దర్యాప్తును నిస్పాక్షికంగా, త్వరిత గతిన పూర్తి చేసి, నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బాధిత బాలికకు వైద్య సహాయం అందించడంలోను, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయంలో ఎప్పటికప్పుడు మహిళా భద్రతా విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.