బీజేపీలోకి మరో ప్రముఖ నటి… మమత కొత్త పొత్తు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచీ దేశంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకీ చాలా హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా పలువురు ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతిసేలా బీజేపీ పార్టీ అంది వచ్చిన అవకాశాలన్నింటినీ చక్కగా వినియోగించుకుంటుంది. తమతో వచ్చే వారు ఎవరైనా ఓకే అంటూ పార్టీ కండువా కప్పేస్తోంది బీజేపీ. అందులో భాగంగా తాజాగా బెంగాలీ సినీ తార స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. తన అందచందాలతో బెంగాల్ ప్రజలను సమ్మోహితులను చేసిన స్రబంతి కోల్కతాలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గియా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో స్రబంతి పార్టీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కినట్లైంది.


కాగా ఈనెల 27 వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కానుండటంతో పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఓడించేందుకు మమత అన్ని ఎత్తులను వేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో మమత బెనర్జీకి బెంగాల్ లో మరో కొత్త మిత్రుడు దొరికాడు. బీహార్ ఎన్నికల్లో పోరాట పటిమను ప్రదర్శించి ప్రజల మెప్పును చూరగొన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో దోస్తీ కట్టేందుకు మమత రెడీ అయ్యారు. ముఖ్యంగా బెంగాల్ లో బీహార్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ఆర్జేడీ వేచి చూస్తుంది. సుమారు 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసేందుకు తేజస్వి యాధావ్ రెడీ అయ్యారు. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం మమత బేజార్జీతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ కాబోతుండటంపై ప్రాథాన్యత సంతరించుకుంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. అలాగే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మమత బెనర్జీకి మద్దతు ఇస్తున్నారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీతో, బీహార్ లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *