బిఏ రాజు మృతి.. ప్రముఖుల సంతాపం…
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ను కరోనా బలి తీసుకున్న కొద్ది రోజుల్లోనే మరో షాకింగ్ వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదేమంటే… ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మధుమేహం వ్యాహితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. బిఏ రాజు సతీమణి బి.జయ రెండేళ్ల క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు.
అయితే కుమారుడు అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన విఎఫ్ఎక్స్ నిపుణుడు. మరో కుమారుడు శివ కుమార్… ప్రస్తుతం ’22’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా బిఏ రాజు ‘ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం’ వంటి సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బీఏ రాజు ఆకస్మిక మృతితో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, కొరటాల శివ, విశాల్, నందమూరి కళ్యాణ్ రామ్, ఆనంద్ దేవరకొండ వంటి సెలెబ్రిటీలు ఆయన ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాకుండా టాలీవుడ్ లో సుమారు 1500 పైగా సినిమాలకు బిఏరాజు పిఆర్ఓ గా పని చేశారు. ఇటువంటి బిఏ రాజు ఆకస్మిక మృతి సినీ వర్గాలను విషాదంలో ముంచింది. బిఏ రాజు మృతికి గౌరవ నివాళులు అర్పిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పీఆర్వోలు ఈరోజును బ్లాక్ డేగా ప్రకటించారు. ఈ రోజు (మే 22)న సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ను పోస్ట్ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం ఆయనకు అర్పించే ఘనమైన నివాళిగా వెల్లడించారు.