ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆ తమిళ్ హీరో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతుంది. రోజు రోజుకీ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ముఖ్యంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. డీఎంకే 173 అభ్యర్థులతో కూడిన జాబితాను తాజగా విడుదల చేసింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగడం విశేషం. గతంలో కరుణానిధి పోటీ చేసిన చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేస్తున్నాడు.
కాగా 1996 నుంచి చెపాక్ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. 2008లో చెపాక్, ట్రిప్లికేన్ నియోజక వర్గాలను విలీనం చేసి ఒక్కటిగా చేశారు. ఆ తర్వాత కూడా ఆ నియోజక వర్గం నుంచి డీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. మరి ఈసారి ఆ స్థానం నుంచి ఉదయనిధి స్టాలిన్ బరిలో ఉండటంతో రసవత్తర రాజకీయ పోరు నెలకొంది.