పోర్టులపై అధికారం ఆయా రాష్ట్రాలకే ఉండాలి: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెగేసి చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని గౌతం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా పోర్టుల డ్రాఫ్ట్ బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పేందుకు నెల రోజుల పాటు కేంద్రాన్ని సమయం కోరామని ఆయన తెలిపారు. అసలు పోర్టులు ఉమ్మడి జాబితాలో లేవని వ్యాఖ్యానించిన ఏపీ మంత్రి.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కానంత వరకే కేంద్రానికి పూర్తిస్థాయిలో సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని అలా కాని పక్షంలో కేంద్ర విధానాలకు ఏమాత్రం మద్దతు ఉండదని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖపై కూడా ఆయన స్పందించారు. స్టాలిన్ లేఖలోని అంశాలను మేం పూర్తిగా ఏకీభవిస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైతే తీర ప్రాంత రాష్ట్రాలతోను కలిసి మాట్లాడతామని గౌతమ్రెడ్డి వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటు పై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని ఎట్టిపరిస్థిల్లోనూ తాము అంగీకరించేది లేదని ఆయన అన్నారు. కాగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తాము ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ కూడా స్పష్టం చేసినట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మీడియాకు వివరించారు.