న్యాయ వ్యవస్థ ఏమన్నా బీజేపీ చేతుల్లో ఉందా?
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో తిరుపతి ఉప ఎన్నికతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. సీఎం వైఎస్ జగన్ బెయిల్పై ఉన్నారని.. త్వరలోనే ఆయన బెయిల్ రద్దు అయిపోతుంది అంటూ.. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చు.. జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది అంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ విమర్శనాస్త్రాలను సంధించారు. సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేతలు ముందే ఎలా చెప్తారు..? న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా..? అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో ఉందని ఏది మాట్లాడినా ప్రజలు వింటారని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డ ఆయన వ్యవస్థలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారూ? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ లోపాయికారికంగా పని చేస్తున్నాయని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని, చంద్రబాబు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన వారితో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలోని కొందరు వ్యక్తులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారంటూ సజ్జల తీవ్రంగా దుయ్యబట్టారు.