నీరవ్ మోదీ అప్పగింతకు యూకే కోర్ట్ ఓకే ….
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోది. వజ్రాల వ్యాపారిగా వేల కోట్ల రూపాయలను బ్యాంక్ కు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని తిరిగి భారత్కు అప్పగించాలని యూకే కోర్టు స్పష్టం చేసింది. నీరవ్ మోదీ భారత్లో సమాధానం చెప్పాల్సిన కేసులు ఉన్నాయని దీంతో నీరవ్ ను ఇండియాకు పంపాలని వెల్లడించింది. ఈ వ్యవహారంపై సుమారు రెండేళ్లకు పైగా జరుగుతున్న న్యాయపోరాటమనే తంతుకు ఎండ్ కార్డ్ పడినట్లేనని అర్థమౌతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుడు అయిన నీరవ్ మోదీ సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని కోర్టు అభిప్రాయపడింది. మనీలాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని యూకేలోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు జిల్లా జడ్జి సామ్యూల్ గూజీ తెలిపారు. ‘ అయితే ఈ కేసుకు సంబంధించి చాలా అంశాలు ఇండియాలో కోర్టు ట్రయల్స్లో ఉన్నాయి. ఆయన నేరం చేశారు అనడనడానికి సరిపడిన ఆధారాలు ఉన్నాయని నేను మరోసారి విశ్వసిస్తున్నాను.’ అని జడ్జి శామ్యూల్ వివరించారు. అలాగే భారత్లోని జైళ్లలో సరైన సదుపాయాలు లేవనే వాదనను కూడా ఆయన తిరస్కరించారు. నిందితులను జైల్లో ఉంచే ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని బ్యారెక్ నెంబర్ 12 అనేది డిటెన్షన్కు సరిపడిన విధంగానే ఉందని కరాఖండిగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం లండన్లో ఉన్న జైళ్ల కంటే ముంబై ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైల్లో బ్యారెక్ నెంబర్ 12లో వసతులు మెరుగ్గానే ఉన్నాయని జడ్జి శామ్యైల్ గూజీ వివరించారు.
అయితే సుమారు రూ.14 వేల కోట్ల విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోదీ నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని భారత్కు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, భారత్లో జైళ్ల గురించి, ఇతరత్రా అంశాలను లేవనెత్తుతూ పలుమార్లు కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇన్నాళ్లు వేచి చూసిన కోర్టు ఎట్టకేలకు నీరవ్ పై తాజాగా యూకే కోర్ట్ తేల్చేసినట్లుగానే తీర్పును వివరించినట్లైంది.