నా తొలి సంతకం దానిపైనే : స్టాలిన్
తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని డీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే తమిళనాడు ఎన్నికలపై సర్వేలు కూడా డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉండటంతో మరింతగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్ అభ్యర్థుల నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా తంజావూరు జిల్లా ఒరత్తనాడు నియోజకవర్గంలో ఈరోజు ఉదయం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, రైతు బిడ్డని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేక పోతున్నారని దయ్యబట్టారు. కాగా తాము అధికారంలోకి వస్తే సహకార రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. కరోనా బాధితులకు రూ.4వేల రూపాయల ఆర్థికసాయం అందజేస్తామని కూడా స్టాలిన్ వివరించారు.