నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ నోముల : కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. ఈరోజు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే ఇదే సమయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. నోముల నర్సింహం వయసులో తన కంటే చిన్నవాడేనని తెలిపిన కేసీఆర్ కరోనా వచ్చి పోయిందని.. ఇలా సంతాపం తీర్మానం తాను ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని అన్నారు.
అదేవిధంగా పోరాటాల పురిటగడ్డ… నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ నోముల నర్సింహం అని కొనియాడారు. విద్యార్థి దశ నుండే పోరాటాల్లో ఉన్న నోముల… న్యాయవాదిగా కూడా పేదల పక్షాన నిలిచి పోరాడాడని పేర్కొన్నారు. అలాగే.. ఆయన అసెంబ్లీలో సభల్లో చలోక్తులు… తెలంగాణ నుడికారం ఉట్టిపడేలా నోముల ప్రసంగాలు ఉండేవని వెల్లడించారు. ఈ తరం నాయకులు ఆయన నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. సీపీఎంకు విశేష సేవలు అందించిన నోముల నర్సింహం ఆ పార్టీ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. అలాగే పేద యాదవ కుటుంబం నుండి వచ్చిన నోముల.. అకాల మరణం తీరని లోటు అని సీఎం కేసీఆర్ వివరించారు.