దేశంలో విజృంభిస్తున్న కరోనా- మళ్లీ లాక్ డౌన్ తప్పదా..?
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 39,726 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కి చేరింది. ఇందులో 1,10,83,679 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,71,282 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 154 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,59,370 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.
అయితే నిన్న ఒక్కరోజే ఇండియాలో 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గుజరాత్ లోని పలు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూను విధించారు. వీకెండ్ రోజుల్లో అహ్మదాబాద్ లో మాల్స్, సినిమా హాళ్లను మూసేస్తున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే ఏకంగా 25 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో కూడా కేసులు విస్తరిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను నిలిపివేశారు. అదే విధంగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ మధ్య కూడా బస్సు రవాణను నిలిపివేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
అదేవిధంగా దేశంలో కరోనా కేసులు పెద్దఎత్తున పెరుగుతుండటంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరికి ఉచితంగా టీకాను అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్టుగానే బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా టీకాను అందిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగానే టీకాను ప్రభుత్వం అందిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది బీహార్ ప్రభుత్వం. బీహార్ లోని వైద్యులు, వైద్యసిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి సంబంధించి ఎవరూ కూడా ఏప్రిల్ 5 వ తేదీ వరకు సెలవు తీసుకోకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు వ్యాక్సిన్ అందిస్తూనే మరోవైపు కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడం విశేషం. దేశంలో మరింతగా రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.