తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్…
దేశంలో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ఆ సమయంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. గతంలో వారంలోగా ఈ ఏర్పాటు ప్రక్రియను చేపడతామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్ ట్రేటర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుందని వెల్లడించారు.
అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో మెగాస్టార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుందని, అందుకోసంప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.