తెలంగాణలో పట్టుకోసం షర్మిల, పవన్
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశగా దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కార్యకర్తలు, అభిమానుల వరుస భేటీలతో వినూత్నంగా దూసుకుపోతున్నారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్ఆర్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించి, తాను మాట్లాడటం కోసం రాలేదని మీ కష్టాలు, నష్టాలు పంచుకోవడం కోసం వచ్చానని, తాను మీ కష్టాలలో నిలబడేందుకు, మిమ్మల్ని నిలబెట్టేందుకు వచ్చానని షర్మిల స్పష్టం చేశారు.
అందులో భాగంగా షర్మిలతో సమావేశానికి ఇప్పటికే రిటైర్డ్ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఇది ఇలా ఉండగా తాజాగా తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పురుడు పోసుకుంది హైదరాబాద్లోనే.. తొలి ఎంపీటీసీ గెలిచింది కూడా తెలంగాణలోనే అని ఆయన గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా ఆంధ్రా తనకు జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ తెలిపారు. దీంతో.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఓవైపు షర్మిల పార్టీ పెట్టేందుకు సమాయత్తమౌతున్న ఈ సమయంలో పవన్ కల్యాణ్ కూడా తెలంగాణపై ఇలా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే ఇప్పటికే షర్మిల రాజకీయంగా కొత్త పార్టీ కోసం చర్చోపచర్చలు జరిపిన విశ్లేషకులు పవన్ తెలంగాణలో రాజకీయ కదలికలపై కూడా తీవ్ర చర్చ చేస్తున్నారు. ఎప్పుడూ తనకు కేసీఆర్ అంటే ఇష్టమని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో కేసీఆర్ కనుసన్నల్లో రాజకీయాలను నడిపేందుకు రెడీ కాబోతున్నట్లు స్పష్టమౌతుంది. అసలే తెలంగాణ బీజేపీతో పవన్ కు అంతగా కుదరడం లేదు. తెలంగాణ బీజేపీ, జనసేనను లెక్కలోకి కూడా తీసుకోకపోవడంపై పవన్, కేసీఆర్ రాజకీయాలపై తీవ్ర చర్చ జరుగుతుండటం విశేషమనే చెప్పాలి.