తిరుపతి ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. తిరుపతి బైపోల్లో జనసేన మద్దతుతో బరిలోకి దిగుతోన్న భారతీయ జనతా పార్టీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేయడం విశేషం.
సుమారు ఐదు, ఆరు పేర్లను పరిశీలించిన బీజేపీ వారి బ్యాక్ గ్రౌండ్తో పాటు అన్ని సమీకరణలపై లెక్కలు కట్టినట్టుగా తెలుస్తోంది. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రత్నప్రభ పేరు ఫైనల్ చేసింది. ఇందుకు సంబంధించి రత్నప్రభ పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది.
కాగా తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపగా.. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.