తగ్గేదే లేదు… మా సీఎస్ ను పంపేదే లేదు : దీదీ
ఎన్నికల ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తుంది. తాజాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అదేమంటే… తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బంద్యోపాధ్యాయ్ ని రిలీవ్ చేయలేనని.. కేంద్రానికి పంపించేది లేదంటూ ఆమె లేఖలో స్పష్టం చేశారు. తమ సీఎస్.. కేంద్రం దగ్గర రిపోర్ట్ చేయాలన్న ఉత్తర్వులను చూసి ఆశ్చర్యపోయానని తెలిపిన ఆమె కేంద్రం ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలు తనను షాక్కు గురుచేశాయని వెల్లడించారు. బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో తన చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేదని లేఖలో స్పష్టం చేశారు.
అంతేకాకుండా గతంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చట్టపరమైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని తాము భావిస్తున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నారు దీదీ. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా సంక్షోభ నిర్వహణను సీఎస్ చూసుకుంటారని కూడా తెలిపారు మమత బెనర్జీ. కాగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశానికి సీఎం మమతా బెనర్జీ.. హాజరుకాకపోవడంపై సీరియస్ అయిన కేంద్రం.. కొన్ని గంటల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేయడం షాక్ కి గురి చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగాల్ సీఎస్ ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ… ఇదే సమయంలో.. ప్రధానికి లేఖ రాశారు దీదీ. ఆ ఆదేశాలు చట్టపరంగా చెల్లవని, ఇవి అసాధారణం, రాజ్యాంగ విరుద్ధమని తన లేఖలో పేర్కొన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.