ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు… ఏ క్షణంలోనైనా టీపీసీసీ చీఫ్ ప్రకటన..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిని ఎవరిని నియమించాలి అనే దానిపై ఢిల్లీలో రాజకీయం తీవ్ర రసకందాయకంగా మారింది. ఏ క్షణంలో అయినా అధిష్టానం పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉండటంతో లాబీయింగ్ ల వ్యవహారం రసకందాయకంగా మారింది. ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తీవ్ర చర్చోపచర్చలు సాగిస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హైదరాబాద్లోని ఉత్తమ్ నివాసంలో సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఢిల్లీ పెద్దల ఆలోచన, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… వారిద్దరి భేటీ తర్వాత వెంటనే ఎంపీ కోమటిరెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అదేవిదంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వారం క్రితమే ఢిల్లీ చుట్టి వచ్చారు. ఉన్నట్టుండి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడంతో హాట్ చర్చకు దారితీస్తుంది. జరుగుతున్న పరిణామాలను బట్టి టీపీసీసీ పదవి కోమటిరెడ్డిని తప్పక వరించేలా తెలుస్తోంది. అసలు ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను బట్టి కోమటిరెడ్డికి టీపీసీసీ ఇస్తేనే పార్టీ కాస్త కోలుకొనే అవకాశం ఉంది. అంతేకానీ రేవంత్ రెడ్డికి ఇచ్చి తిరిగి మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలాన్ని తెచ్చుకొనే పరిస్థితి రావద్దని కొందరు విశ్లేషకులు, రాజకీయ నేతలు తర్జనభర్జనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ను కలసిన కోమటిరెడ్డి తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం అందుతుంది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్కు ఫోన్ చేసి కొంత కటువుగానే మాట్లాడారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతుంది. దీంతో ఎంపీ కోమటిరెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ విషయంపై జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా టీపీసీసీ చీఫ్ ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.