డ్యాడీస్ హోమ్ లో రాక్స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్…!
తెలుగు సంగీతంలో సరికొత్త బాణాలను అందిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నంగా దూసుకుపోతున్న రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజును గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. అలాగే… ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారు దేవిశ్రీ ప్రసాద్.
అంతేకాకుండా ‘వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్వారు చేస్తున్న సేవ నా మనసును తాకింది. గతంలో సర్ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటినుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. నా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో ఇలాంటి వారికి అండగా నిలబడాల్సిన అవసరం మనకెంతో ఉంది’ అని తెలిపారు దేవిశ్రీప్రసాద్. మొత్తానికి దేవిశ్రీప్రసాద్ తన పుట్టినరోజు వేడుకలను అలా అనాథలతో గడపడం ఎంతో విశేషమనే చెప్పాలి.