డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ డాక్టర్ సుధాకర్ మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా జగన్రెడ్డి ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసింది. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరికి ఇలా అంతమొందించారు. ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం అంచూ తెలిపారు నారా లోకేష్.
అసలు విషయంలోకి వెళ్తే… నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలలో అనస్థీషియన్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కరోనా ప్రారంభ సమయంలో మాస్కు లు లేవని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆ డాక్టర్ సస్పెన్షన్ సమయంలో ఆయన వ్యవహారం సంచలనం సృష్టించింది. డాక్టర్ సుధాకర్ మానసిక పరిస్థితి బాలేదంటూ కొన్నాళ్ళు విశాఖ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. కాగా సుధాకర్ వ్యవహారంపై గతంలో సీబీఐ విచారణ కూడా జరిపింది.