డబ్బులకోసం పాక్ ప్రధాని ఇల్లు అద్దెకు…!
ముఖ్యంగా ఈ మధ్య పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ఎంతో దిగజారిపోయింది. అస్తవ్యస్తంగా మారింది. పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం పేరుతో సంపాదన పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ చైనాకు వత్తాసు పలుకుతూ, ఇండియాని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది చెప్పండి… ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పరిస్థితి కూడా అలానే ఉంది మరి.
అదేమంటే… ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక నివాసం ఉంది. విశాలమైన స్థలంలో ఉన్న అధునాతన భవనం అది. ఆ భవనాన్ని ఇటీవలే ఆయన ఖాళీ చేశారు. మొదట ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లు, సెమినార్ల కోసం ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు సంపాదన వస్తుందని అది ప్రభుత్వ నిర్వాహణకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెప్తుండటం విశేషం.