టెన్త్, ఇంటర్ పరీక్షలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు….
ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, వాయిదాలపై వార్ నడుస్తుంది. అయితే ఇదే సమయంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సిఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. ఏ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువేనని సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. పిల్లల తలరాతలు మార్చాలనే తపనతోనే అనేక పథకాలు అమలు చేస్తున్నామని.. విద్యారంగంలో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నామని.. నాడు- నేడు కింద రాష్ట్రంలో పాఠశాలు, అంగన్వాడీల రూపురేఖలను మార్చుతున్నామని అన్నారు. ప్రతి పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్నామని.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కోసం 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇంకా పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి పెంపోందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని.. డిసెంబర్ లో రెండో విడత వసతి దీవెన నిధులు చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అంతేకాకుండా పది, ఇంటర్ పరీక్షలను వాయిదా లేదా రద్దు వేయాలన్న డిమాండ్ పై సిఎం జగన్ స్పందించారు. ‘పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు సర్టిఫికేట్లపైనే ఆధారపడి ఉంది. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. పాస్ సర్టిఫికేట్లతో మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయా? విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నాం. విధ్యార్థులకు నష్టం చేయబోము’ అంటూ సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.