టీడీపీ నిర్ణయంతో వైసీపీ నేతల్లో సంతోషం : జేసీ బ్రదర్స్
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 8వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పార్టీలోని పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అదేమంటే బాబు నిర్ణయంపై సీనియర్ల నుండి జూనియర్ల వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరిగానీ, విజయనగరం నుంచి అశోక గజపతి రాజు గానీ ఇంకా ఎంతో మంది బాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అంటూనే రగిలిపోయే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
ముఖ్యంగా ఏదైనా పార్టీలో గానీ బయటగానీ అది ఏపాటి విషయంపైనైనా ముక్కుసూటిగా చెప్పడంలో జేసీ బ్రదర్స్కు మించినవారు లేరు. ఈ విషయంలోనూ చాలా ఓపెన్గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని, కానీ, అధిష్టానం ఆదేశాలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే అని ఆయన అన్నారు. అలాగే మేం పోటీలో లేకుంటే పోలీసులకు వన్ సైడ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పని ఉండదని వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ నిర్ణయంతో వైసీపీ అభ్యర్థులు చాలా సంతోషంగా ఉన్నారని.. రూపాయి ఖర్చు లేకుండా వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. కాగా ఇవి పార్టీ సింబల్పై జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలు ఓటింగ్కు వెళ్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు