టార్గెట్: ‘అంబానీ… కదలికలపై ఆగంతక లేఖ’

ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ రిలయన్స్ బాస్ ముఖేష్ అంబానీ నివాసం ముంబైలోని ‘ఆంటిలియా’ వద్ద పేలుడు పదార్థాలతో ఓ వాహనం ఆగి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలో తాజాగా స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా నిలిచి ఉండటం సంచలనంగా మారింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగడంతో… వాహనం లోపల పెట్టి ఉంచిన ఒక బ్యాగును, దాంతోపాటు ఓ లేఖను కూడా పోలీసులు గుర్తించారు.


అయితే ఆ లేఖలోని అంశాలు ఏమిటి అనేది ఇంకా తెలియడం లేదు. కానీ ‘ముఖేశ్ భయ్యా, నీతా భాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’ అని లేఖలో రాసినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత గురువారం రాత్రి 1 గంటకు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆగంతకులు స్కార్పియో, ఇన్నోవా రెండు వాహనాల్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. స్కార్పియో డ్రైవర్ అంబానీ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, మరో కారులో అక్కడినుంచి జారుకున్నట్లు స్పష్టమౌతుంది.


కాగా ఆగి ఉన్న వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆయన ఓ ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీఫుటేజీని పరిశీలిస్తున్నారు. అసలు లేఖ వ్యవహారం కూడా తేల్చే పనిలో పోలీసుల దర్యార్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. లేఖను బట్టి ఇది ఆగంతకుల పనా? లేకా అంబానీ లక్ష్యంగా ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా? అనే విషయాలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *