జనసేన- బీజేపీకి ప్రచారం చేస్తా: చింతమనేని

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల నేతలు మున్సిపల్ ఎన్నికల కోసం తీవ్రంగా ప్రచారాన్ని జరుపుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలపై ఆయన తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఘటనలపై స్పందిస్తూ.. నామినేషన్లు వేసి.. వాటిని విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అదేమంటే టీడీపీ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న డివిజన్లలో.. పోటీలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులుంటే.. వారి తరఫున తాను ప్రచారం చేస్తానని చెప్పి సంచలనానికి తెరలేపారు. అయితే ఏలూరులోని 23వ డివిజన్లో జనసేన-బీజేపీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారి తరఫున ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు చింతమనేని ప్రభాకర్. ఇదే సమయంలో పార్టీని అమ్ముకున్నవారికి భవిష్యత్ ఉండదని.. పార్టీని నమ్ముకున్నవారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
కాగా చింతమనేని చేసిన వ్యాఖ్యలు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత హీటును పెంచాయనే చెప్పాలి. మున్సిపల్ ఎన్నికలు జరిగే ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష నేతలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ వారికి పార్టీ కండువాలు కప్పుతుండటంతో తెలుగు దేశం పార్టీ కలవరపాటుకు గురౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *