జగన్ రెడ్డి సైకో పాలనకు ఇదో నిదర్శనం : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ నేత లోకేష్ విరుచుకు పడ్డాడు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సర్కార్ పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తాడు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డాడు. దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అంటూ లోకేష్ చెలరేగి పోయాడు. ‘నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని.. వై కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే బైపాస్ సర్జరీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్రెడ్డి సైకో మనస్తత్వానికి నిదర్శనం. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్మెంట్ గా మారిపోయింది. ప్రశ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలు. ఇదీ నియంత సైకో జగన్రెడ్డి పాలన. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ నారా లోకేష్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.