జగన్ తో కలిసి మోడీ వద్దకు నేనూ వెళ్తా : స్వామి
ఆంధ్రప్రదేశ్ లోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తనకు తగినంత అవగాహన లేకపోయినప్పటికీ ఆ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నానని మండిపడ్డారు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎయిరిండియా ప్రైవేటీకరణను కూడా తాను వ్యతిరేకించానని వివరించారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ప్రధానిని కలిసేటప్పుడు తాను కూడా వెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై సుబ్రాహ్మణ్య స్వామి నిప్పులు చెరిగారు. తెర వెనుక చంద్రబాబు ఉండి టీటీడీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, వెంకన్న భక్తునిగా తాను ఆ ప్రచారంపై చాలా బాధ పడ్డానని అన్నారు. అసలు చంద్రబాబు ఉన్నట్టుండి సోనియా కాళ్లపై ఎందుకు పడ్డారో ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నాడని, అప్పుడే బాబు ప్రజల వద్ద విశ్వసనీయతను కోల్పోయారని అన్నారు. టీటీడీ అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కాగ్ తో ఆడిట్ చేయించాలన్న సీఎం నిర్ణయం చాలా మంచి పరిణామమని, టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు.