జగన్ కు మెగాస్టార్ అభినందనలు…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రారంభించిన వషయం తెలిసిందే. అయితే కేంద్రమంత్రి హర్దీప్సింగ్ కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండిగో సంస్థ మార్చి 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. కాగా 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేశారని.. నాలుగు విమానాలకు పార్కింగ్ తో పాటు మౌలిక వసతులను కల్పించామని కూడా జగన్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
అయితే ఈ విమానాశ్రయానికి స్వాతంత్రయ సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. గాంధీ, వల్లభా భాయ్ పటేల్ ల కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి, ప్రజల తరపున పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడితేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని జగన్ స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూల్ ఎయిర్పోర్ట్ కు ప్రకటించటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. గౌరవనీయులైన సీఎం జగన్ గారికి హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నాను’ అంటూ చిరు ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరచడంతో అభిమానులు సంబరపడుతున్నారు