చిరుతతో బాలుడు పోరాటం… గాయాలు
కర్నాకటలో ఓ ఘటన చోటుచేసుకుంది. మైసూరు నగరానికి సమీపంలోని కడకొళ వద్ద ఓ బాలుడిపై చిరుత దాడికి దిగింది. అయితే చిరుత దాడి నుంచి బాలుడు ధైర్యంగా, ఎంతో తెలివిగా తప్పించుకోవడం విశేషం. కొద్దిపాటి గాయాలతో బయటపడటం అంటే ఎంతో సాహసమనే చెప్పాలి.
అసలు విషయం ఏంటంటే.. గత శనివారం రోజున కడకొళ గ్రామానికి చెందిన నందన్ అనే బాలుడు ఆరోతరగతి చదువుకొనేందుకు బడికి వెళ్లాడు. రోజుట వలెనే స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా నందన్ పై ఓ చిరుత దాడి చేసింది. ఆ సమయంలో చిరుతను చూసి భయపడని నందన్ దానిపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో చిరుత ముఖంపై బాలుడు పిడిగుద్దులు గుద్దాడు. ఆ దాడిలో చిరుత కన్నుకు తీవ్ర గాయమైంది. దీంతో బాలుడిని వదిలేసిన ఆ చిరుత అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది. గాయపడిన నందన్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం నందన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా బాలుడి సాహసాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.