చంద్రబాబుపై వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతల నారా చంద్రబాబు నాయుడిపై వ్యంగ్య బాణాలను విడిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజున పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.
ముఖ్యంగా ఈ ఏడాది నుంచి బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్‌ను తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు. అలాగే అక్కచెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో మేం బడ్జెట్ ద్వారా లెక్క కట్టి మరీ చెప్తున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల మీద వేధింపుల నిరోధానికి కమిటీల ఏర్పాటు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
అంతేకాకుండా తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు. కోడలు మగపిల్లాడ్ని కంటే… అత్త వద్దంటుందా? అంటారు. అలాగే అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్నవారు కూడా కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలని చెప్తుంటే ఆశ్చర్యంగా చూడడం తమ వంతు అయిందని గుర్తుచేసుకున్నారు. ఇంకా కనీసం ఆలోచన లేకుండా ఇలాంటి మాటలు అన్నప్పుడు, విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించాయని తన ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.