చంద్రబాబుకు సుబ్రహ్మణ్య స్వామి షాక్…

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సుబ్రహ్మణ్య స్వామి కేసు వేయనున్నారు. ముఖ్యంగా టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించారనే ఉద్ధేశ్యంతో ఇప్పటికే ఓ దినపత్రికపై తిరుపతి కోర్టులో టీటీడీ ఈవో పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తరఫున కేసు వాదించేందుకు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్రమణ్య స్వామి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పవిత్రత దెబ్బతీసేలా ఓ పత్రిక, దాని వెబ్ సైట్ లో స్టోరీ వచ్చిందని, దీనిపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం కేసుతో పాటు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండటంతో క్రిమినల్ కేసు కూడా దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా టీటీడీని కాగ్ కిందికి తెచ్చి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై తిరుపతి కోర్టులో మరో కేసు వేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచి హైకోర్టుకు వెళ్లి అక్కడ హిందూ దేవాలయాల పై జరుగుతున్న అరాచకాలపై కేసు వేస్తానని కూడా ఆయన వివరించారు. టీటీడీ దేవస్థానాన్ని ప్రభుత్వం అధిపత్యం నుండి తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు ఆయన వివరించారు. కాగా ఇప్పటికే తమిళనాడులో నటరాజ స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధిపత్యం లేకుండా చేసినట్లు కూడా సుబ్రహ్మణ్య స్వామి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *