చంద్రబాబుకి చెంచాడు సిగ్గు, చారెడు ఎగ్గైనా లేదే : పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. తాజాగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారని… అలాంటప్పుడు అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా? అంటూ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదని, జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. అసలు అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని నాని వెల్లడించారు. కరోనా కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో కూర్చొని రాజకీయ చేతబడి చేస్తున్నారని, జనం సొమ్మును అచ్చెన్నాయుడు హల్వా తిన్నట్టు తింటే కేసులు పెట్టకూడదా…? సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయమని చంద్రబాబు గతంలో ధూళిపాళను కోరింది నిజం కాదా..? సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పలేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
అంతేకాకుండా చంద్రబాబు తీరు చూస్తుంటే…. లక్ష జీవాలను చంపిన నక్క ముసలి తనంలో నీతులు చెప్పినట్టుంది అని నాని విరుచుకు పడ్డారు. లోకేష్ హెరిటేజ్ బేబీ అని, రాష్ట్రంలో సహకార డెయిరీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబే అని అన్నారు. అలాగే అసలు రఘు రామకృష్ణరాజుకు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన ఆయన ప్రతి కేసునూ రఘు రామకృష్ణరాజు కేసులా ముగిద్దామని చంద్రబాబు సిగ్గు లేకుండా కార్యకర్తలకు చెప్తుండటం విడ్డూరంగా ఉందని భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తుందనే కలలో బాబు ఉండటం తమ్ముళ్ల దౌర్భాగ్యమని పేర్నినాని వివరించారు.