కేసీఆర్ దళితులపై ఫేక్ ప్రేమ చూపుతున్నారు : బండి సంజయ్

తెలంగాణ ప్రజల స్పందన, బీజేపీపై ఆదరణ చూసిన తర్వాత ఆందోళన చెందిన సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకాన్ని తీసుకువచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం దళితుల మీద ‘ఫేక్ ప్రేమ’ చూపిస్తున్నారని.. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని ఆయన వెల్లడించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వివరించారు. అలాగే ‘ఫేక్ ఐడి’ కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారని.. కోట్ల రూపాయలు కుమ్మరించి ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.

అదేవిధంగా సీఎం కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎదుర్కొనాలని వెల్లడించారు. అక్రమ పద్ధతిలో ఉపఎన్నికలను గెలవాలని చూస్తున్నారని.. కోట్ల రూపాయలు కుమ్మరించి బంపర్ ఆఫర్లతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ప్రజలు కేసీఆర్ వ్యవహార శైలిని ఛీదరించుకుంటున్నారని.. తెలంగాణలో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారని.. హిందువులు నివసించే ప్రాంతాలలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చి వేతలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా.. అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్ కు లేదని అన్నారు. అంతేకాకుండా ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదని.. పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్, ఎంఐఎం అడ్డుకుంటున్నాయని వివరించారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయని.. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే పాతబస్తీలో రోడ్లు వెడల్పు చెయ్యాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *