కేజీఎఫ్-2 వాయిదాకు కారణం అదేనా..?
యశ్ హీరోగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా ఖరారు చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో విడుదల వాయిదా వేస్తున్నామని మాత్రమే మే మాసంలో నిర్మాతలు వెల్లడించారు. అయితే… ఇప్పటికీ కొత్త విడుదల తేదీని ప్రకటించకపోవడానికి కారణం ఇదేనంటూ టాక్ నడుస్తోంది.
అయితే ఇందులో అధేరా అనే బలమైన విలన్ రోల్ ను సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఆయన అనారోగ్య కారణంగా చిత్రీకరణ సమయంలోనే షెడ్యూల్స్ కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు కూడా సంజయ్ దత్ డబ్బింగ్ కారణంగా కొంత ఆలస్యం అవుతోంది. ‘కేజీఎఫ్ -2’ హిందీ వర్షన్ కు తానే డబ్బింగ్ చెప్తానని… సంజయ్ దత్ చెప్పారట. ఆయన ఆ పనిని పూర్తి చేసిన తర్వాతే దక్షిణాది భాషల్లో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది. సంజయ్ దత్ ను, ఆయన వాయిస్ ను మ్యాచ్ చేసే డబ్బింగ్ ఆర్టిస్టులతో దానిని చెప్పించాలి. అందుకోసమే కాస్తంత సమయం పడుతోందని సమచారం అందుతుంది. అంతేకాకుండా బయటకు చెప్పకపోయినా… ‘కేజీఎఫ్ -2’ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. కానీ.. గతంలోనే ఆ తేదీని ‘ట్రిపుల్ ఆర్’ మూవీ లాక్ చేసి పెట్టేశారు. అలాగే అనుకున్న తేదీకి ‘ట్రిపుల్ ఆర్’ను రిలీజ్ చేయాలని రాజమౌళి టీం తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా ‘ట్రిపుల్ ఆర్’ దసరాకు రావడం ఖాయమైతే మాత్రం ‘కేజీఎఫ్ -2’ కాస్తంత ముందుకో, వెనక్కో జరిగే అవకాశం ఉంది. లేదా ‘ట్రిపుల్ ఆర్’ వేరే తేదీకి వెళితే ‘కేజీఎఫ్ -2’ దసరాకు రాయడం పక్కా అని సమాచారం అందుతుంది.