కృష్ణా జలాలపై రాజీలేని పోరు: సీఎం కేసీఆర్
తెలంగాణ మృఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా జలాల విషయంపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్నాయని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలతో పాటు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని తెలిపారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ నీటి విషయంలో తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తామని అన్నారు.
అదేవిధంగా నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. అయితే తాజాగా సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా సాగిన ఈ సమీక్షా సమావేశంలో.. తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్షపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కాగా స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. కాగా రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించారు. ఆ దిశగా అధికారులకు కీలకమైన సూచనలు చేసినట్లు సమాచారం అందుతుంది.