కరోనాపై యుద్ధం ఇంకా పూర్తి కాలేదు… డెల్టా వేరియంట్లతో జాగ్రత్త…!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. కరోనా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ మానవ శరీరభాగాలపై తీవ్రంగా దాడులు చేస్తూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలోనే అత్యధికంగా మరణాలు నమోదు కావడం ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయితే అమెరికాలో ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయినా కానీ ఇంకా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు సరికదా… అదుపులోకి రాని పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు అమెరికా 245వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ప్రస్తుతానికి పైచేయి మాత్రమే సాధించామని జోబైడెన్ అన్నారు. అలాగే భవిష్యత్తులో తప్పని సరిగా కోవిడ్పై విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా ఏడాది కాలంగా చీకట్లో మగ్గుతున్నామని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని బైడెన్ వివరించారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్లు ప్రపంచాన్ని భయపెడుతున్నాయని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని జో బైడెన్ తెలిపారు.