ఐపీఎల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం ఇదే…
ఎట్టకేలకు బీసీసీఐ… ఐపీఎల్ ట్రోపీపై కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికులకు అదో స్పెషల్ కిక్. అయితే కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. స్టేడియానికి వెళ్లే పరిస్థితి లేకపోయినా.. హోం థియేటర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామన్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్ను పూర్తిగా ముందుకు సాగనివ్వడంలేదు.
అయితే ఇప్పటికే కొన్ని మ్యాచ్ లు జరిగాయి. మిగతా మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే… సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మిగతా టోర్నీ యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి రాగా.. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. కాగా ఈ విషయంపై బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మిగతా మ్యాచ్లను దుబాయ్, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ వెల్లడించింది. కాగా ఐపీఎల్ 14వ ఎడిషన్లో ఇప్పటికే 29 మ్యాచ్లు జరగగా.. మరో 31 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అలాగే ఈ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. విదేశీ ప్లేయర్స్ పాల్గొంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.