ఏప్రిల్ 9న షర్మిల కొత్త పార్టీ
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటుకానుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల, తెలంగాణలో తాను కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
అయితే 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలోని అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించడంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. పార్టీకి జెండా, అజెండా, పార్టీ సిద్ధాంతాలను కూడా అదే రోజున ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యమా షర్మిల పార్టీని ముందుకు నడిపించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. అయితే షర్మిల పార్టీ పెట్టబోతున్నారని చెప్పడంతో పలు పార్టీలకు చెందిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.