ఏపీలో వైద్యులకు సర్కార్ గుడ్ న్యూస్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతుంది. ఈ కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అది ఎంత అంటే.. రూ. 45 వేల నుంచి రూ.70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందని అన్నారు. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కరోనా విధుల్లో ఉన్నట్టు ఆయన వివరించారు.
అదేవిధంగా తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం ఏపీలో పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా నమోదైంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించారని… 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తైనట్టు అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కాగా 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైందని తెలిపిన ఆయన విదేశాలకు వెళ్లే ఉద్యోగులు.. విద్యార్ధులకు వ్యాక్సినేషన్లో ప్రయార్టీ ఉంటుందని వెల్లడించారు. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని సింఘాల్ వివరించారు.