ఏపీలో పరిషత్ ఎన్నికలు… పలు చోట్ల ఉద్రిక్తత…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు కొన్ని ప్రాంతాల్లో క్యూలు కడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని సత్తెమ్మపేటలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార వైసీపీ, జనసేన పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. జనసేన నేతలు ఓటర్లకు డబ్బులు పంచేందుకు వచ్చారని, వారిని వైసీపీ నేతలు అడ్డుకునే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుందని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. కానీ… డబ్బులు పంచేందుకు వచ్చిన జనసేన నేతలను అడ్డుకున్న తమపై జనసేన నేతలు రాళ్లదాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రాళ్లదాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదేవిధంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద కొండూరులో అభ్యర్థుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. పోటీలో లేని సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపరులో కేటాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక చోటే రెండు గుర్తులు కేటాయించడంతో ఓటర్ల ఎక్కడ వేయాలో అర్థంకాని గందరగోళ పరిస్థితిని చవిచూశారు. ఇక నెల్లూరు జిల్లా ఏఎస్ పేట(మ)పొనుగోడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీజేపీ ఏజేంట్ ప్రసాద్- వైసిపి కార్యకర్త మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని వెళ్లి నీటి తొట్టిలో వేసేశాడు బిజెపి ఏజెంట్ ప్రసాద్. పోలింగ్ నిలిచిపోయింది. అయితే ఓటు వేసేందుకు వచ్చిన వైసిపి కార్యకర్తను అభ్యంతరం పెట్టడంతో వివాదం చెలరేగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఇలా పలుచోట్ల చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది.