ఏపీలో జరిగేంత నీచ రాజకీయాలు మరెక్కడా లేవు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాలంలో కూడా నీచ రాజకీయాలు ఆయా పార్టీల నేతలు చేయడం సిగ్గుచేటని అన్నారు మంత్రి అప్పలరాజు. చంద్రబాబు, టీడీపీ నేతలు ,ప్రతిపక్షాలపై మంత్రి అప్పలరాజు ఈరోజు మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవని.. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగితే… ముఖ్యమంత్రి రుయా ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే అది కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సబబని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టడంపై ఆయన నిప్పులు చెరిగారు.
అసలు నిజంగా చంద్రబాబుకు, టీడీపీ నేతలకు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పుష్కరాల్లో సుమారు 40 మంది చనిపోయిన ఘటన చంద్రబాబు మర్చిపోతే ఎలా. అప్పుడే హత్యాయత్నం కేసు పెట్టుంటే చంద్రబాబుకు బుద్దొచ్చి ఉండేది అని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకోవాలని.. మీనాయకుడు ప్రచార ఆర్భాటానికి జనం బలైపోతే ఆరోజు కూడా ఇలాగే అడిగావా..? అచ్చెన్నాయుడికి సిగ్గుందా? దెయ్యంలా క్యాండిల్ నిరసన చేస్తావా? అంటూ విరుచుకు పడ్డారు. అలాగే విజయవాడలో కోవిడ్ హాస్పిటల్లో కొంతమంది చనిపోయినప్పుడు కనీసం ఒక్కరి కోసమైనా విచారం వ్యక్తం చేశావా? హాస్పిటల్ కు అనుకూలంగా విచారణ చేయొద్దంటూ కోర్టులకు వెళ్లారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.