ఎట్టకేలకు బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే కేశినేని శ్వేత మేయర్ అభ్యర్థి అంటూ టీడీపీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నిల సమయంలో టీడీపీలో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి.. నువ్వు ఎంత? అటే నువ్వెంత? అంటూ సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలను పిలిచి సముదాయించారు.
కాగా మేయర్ అభ్యర్థిగా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు కేశినేని శ్వేత వైపే అధిష్టానం మొగ్గు చూపింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన కేశినేని శ్వేత ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తన డివిజన్తో పాటు ఇతర డివిజన్లలో టీడీపీ, మిత్ర పక్షాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మేయర్ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత బెజవాడ టీడీపీలో ఎలాంటి రాజకీయాలు గుప్పుమంటాయో చూడాలి.