ఉయ్యాల వాడ నరసింహారెడ్డిగా కర్నూల్ ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నూతనంగా నిర్మించిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు స్పష్టం చేశారు.
అదేవిధంగా ఈనెల 28 వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమౌతాయని వివరించారు. తొలిదశలో విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 1008 ఎకరాల్లో రూ.153 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ ను కేవలం ఏడాది కాలంలోనే నిర్మించినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అలాగే ఏపిలో కర్నూలు ఎయిర్ పోర్ట్ ఆరో ఎయిర్ పోర్ట్ అని జగన్ అన్నారు. ఈ విమానాశ్రయంలో ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉందని, యుద్ధ ప్రాతిపదికన ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసినట్టు వెల్లడించారు. అందుకు తీవ్రంగా శ్రమించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, అధికారులను అభినందించారు.
అంతేకాకుండా న్యాయరాజధాని అయిన కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ సౌకర్యం తేలిక అవుతుందని అన్నారు. ఎన్నికల కోసమే పనులు పూర్తి కాకుండానే చంద్రబాబు ఎయిర్ పోర్ట్ ను అప్పట్లో ప్రారంభించారని బాబుపై వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు. కాగా ఆస్ట్రియా నుంచి రెండు అధునాతన ఫైర్ ఇంజన్లు దిగుమతి చేసుకున్నామని, డీజీసీఏ అనుమతి పొందటంలో మంత్రులు, అధికారులు ఎంతగానో శ్రమించారని సీఎం జగన్ వివరించారు.