ఈటల రాజీనామా చేస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు….
తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఆయన.. నేరుగా అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలేఖను అందించారు ఈటల రాజేందర్. అయితే ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14వ తేదీన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. కాషాయ కండువా కప్పుకోనున్నారు. కాగా ఈటలతో పాటు.. మరికొందరు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈటల చేరిక సమయంలో మరెంత మంది బీజేపీలోకి వెళ్తారు అనేది చూడాల్సి ఉంది.
అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే తన అజెండా అని ఈ సందర్భంగా ఈటల ప్రకటించారు. ముఖ్యంగా గన్పార్క్లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన హుజూరాబాద్లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డ ఆయన.. కేసీఆర్ వద్ద రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపనలు చేశారు. అంతేకాకుండా చాలా మంది ఫోన్లు చేసి.. ఎందుకు రాజీనామా చేస్తావు? అని అడిగారని.. ఉద్యమంలో లేనివాళ్లు కూడా ఇతర పార్టీల్లో గెలిచి.. రాజీనామా చేయకుండా.. టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొందారని వివరించారు. అలాంటి సమయంలో మీరు రాజీనామా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారని అన్నారు. కానీ
తాను వాళ్లలా కాదని.. అందుకే రాజీనామా చేస్తున్నానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.