ఈటలపై మండిపడ్డ మోత్కుపల్లి.. కారెక్కేట్లుందా…!

తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నేతను బీజేపీలో చేర్చుకుంటారా? అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అదేవిధంగా మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం ఉన్న తనను ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలను పార్టీలో చేర్చుకుంటున్నట్టు తనకు ఒక్కమాట కూడా చెప్పలేదని, భూకబ్జాలు చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. అంతేకాకుండా దళితబంధు వంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా బీజేపి తప్పు చేసిందని కూడా వివరించారు. కాగా కేసీఆర్ను మోత్కుపల్లి పొగడ్తలతో ముంచెత్తారు. దీనిని బట్టి ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు పోకడలను బట్టి అట్టే అర్ధమౌతుంది. కాగా ఈ మధ్యనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారెక్కారు. ఇప్పుడు మోత్కుపల్లి కూడా కారెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారమైతే సాగుతుంది. చూద్దాం ఏం జరగనుంది అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *