ఇది దోపిడీకి.. నిజాయితీకి మధ్య జరుగుతున్న వార్
తెలంగాణలోని ఉపఎన్నిక నాగార్జున సాగర్ ప్రచారం హీటెక్కింది. అన్ని రాజకీయ పార్టీల ఈ ఉపఎన్నికపైనే దృష్టి సారించాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి, పెద్దవూరలలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డి సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాగు తొడగని సన్యాసులకు జానారెడ్డి గురించి ఏమి తెలుసు ? జానారెడ్డి ఎవరని, ఏం చేసిండనే సన్యాసులు కోదండరాంను, మీ కేసీఆర్ ను అడిగితే చెబుతారని మండిపడ్డారు.
అంతేకాకుండా హామీలు అమలు చేయని ప్రభుత్వాన్ని గల్ల పట్టి అడిగాలని స్పష్టం చేశారు. అలాగే రుణమాఫీ ఇతర హామీలు సాధించుకోవడానికి జానారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని అన్నారు. జానారెడ్డి చెయ్యంది ఒక్కటే మందు పంచడం, మత్తులో ముంచి ఓట్లెసుకోవడమని తెలిపారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు నీళ్లు, దళితులకు మూడెకరాలు ఇవ్వని కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం వచ్చిందని వెల్లడించారు. నోముల నరసింహయ్య మీద ప్రేమ ఉంటే 2018 ఎన్నికల్లో గెలిచిన నోములకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆలుగడ్డలు అమ్ముకుని, ఎందుకు పనికిరాని శ్రీనివాస్ కు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాగా జానారెడ్డితో పెట్టుకుంటే బతికి బట్ట కట్టడం సాధ్యం కాదని తెలిసిన కేసిఆర్, సాగర్ లో ఓటమి ఖాయమని తెలిసే భగత్ కు టికెట్ ఇచ్చాడని వివరించారు. అందుకే 14న మల్లి వస్తానంటున్నాడని, ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనించి హస్తం గుర్తుకు ఓటేసి జానారెడ్డిని గెలిపించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు దోపిడిదారులకు, నిజాయితీపరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.