ఇండియాలో భారీగా కరోనా కేసులు- నేతల్లో టెన్షన్
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగానే పెరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం నుంచి తగ్గుతూ వస్తున్న కేసులు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.
ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఇక తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది. ఇందులో 1,11,81,253 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,45,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 199 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,166కి చేరింది. రోజువారీ రికవరీ కేసుల సంఖ్య పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
అంతేకాకుండా దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం నామినేషన్లు, ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఎన్నికలు జరుగుతుండటంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. టెన్షన్ కు తగిన విధంగానే నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు కరోనా బారిన పడ్డారు. అటు ముఖ్యనేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఎంఎన్ఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు, డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రచారం చేసేందుకు వెళ్లాలంటే అభ్యర్థులు భయపడుతున్నారు. కరోనా మహమ్మారికి రోజు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే విద్యాసంస్థలను తమిళనాడు ప్రభుత్వం మూసేసిన విషయం తెలిసిందే.