ఆ వైసీపీ నేత కుటుంబంపై దిశ కేసు…
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చిత్రాతి చిత్రంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షం నేతల తప్పులపై దుమ్మెత్తుపోసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య కుటుంబంపై దిశ కేసు నమోదు అయ్యింది. అత్తింటి వారు తనను చాలా రోజుల నుండి వేధిస్తున్నారంటూ ఝాన్సీ రాణి అలియాస్ సమీరా రాణి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తనను అనుమానంతో ఎప్పుడు హింసించే వారని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆయన కోడలు ఝాన్సీ రాణి ఆరోపించారు. గర్భవతి అని కూడా చూడకుండా శారీరకంగా హింసించారని చెప్తూ తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఐజయ్య దంపతులపై అలాగే ఆయన కుమారుడు రాజశేఖర్ పై దిశ పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆయన ఈ మధ్యనే వైసీపీలో చేరారు. మంత్రులు అనిల్, రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుత వైసీపే ఎమ్మెల్యే ఆర్ధర్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఐజయ్య చేరడం మరింత ఆసక్తిగా కూడా మారింది. ఐజయ్య 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. కానీ.. అక్కడ కూడా టికెట్ దక్కలేదు.. అయినా టీడీపీలోనే కొనసాగిన ఆయన ఈ మధ్యనే వైసీపీలో చేరడం విశేషం.