ఆ వైసీపీ ఎమ్మెల్యే బేకార్ అంటూ ఒవైసీ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోరు తీవ్రతరమైంది. పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వైసీపీ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని బేకార్ అంటూ దుయ్యబట్టారు.
అంతటితో ఆగకుండా ఇలాంటి బేకార్ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాడంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అలాగే.. అతను తనను రానివ్వకుండా ఆపడం ఎవరి తరం కాదని.. మైనార్టీ ఓట్లతో ముఖ్యమంత్రులై.. మాకు ఆంక్షలు పెడుతుండటం భావ్యం కాదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఇలాగే కొనసాగితే అన్ని స్థానాల్లో మేము పోటీ చేసి గెలుస్తామని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వైసిపి రెడ్ల పార్టీ, టీడీపీ కమ్మ పార్టీ అని ఈ రెండు పార్టీలకు పురపాలక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా తన సమావేశానికి సీఎం జగన్ అనుమతి ఇవ్వలేదని ఓవైసీ వివరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాయలసీమలో రాజకీయాలు హీటెక్కాయి.