ఆ పెయింటింగ్ ఏకంగా రూ.450 కోట్ల పలికింది….
కూసింత కళాపోసన ఉండాలే గానీ, ఏ కాలమైనా సరే వరాల వర్షం కురవక మానదు.
తాజాగా ఓ కళాకారుడు వేసిన పెయింటింగ్ కోట్ల రూపాయలు పలికింది. గత సంవత్సరం కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి దుబాయ్ కు చేరుకొని అక్కడ ఓ హోటల్ లో మకాం వేశాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అతి పెద్ద క్యాన్వాస్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఈ పెయింటింగ్ కోసం అతను సుమారు 7 నెలలపాటు కష్టపడ్డాడు. రోజుకు 20 గంటల చొప్పున క్యాన్వాస్ పెయింటింగ్ పూర్తి చేశాడు. అతిపెద్ద క్యాన్వాస్ ను 70 ఫ్రేములుగా విభజించి వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును చిన్న పిల్లల కోసం వినియోగించాలని భావించాడు.
కాగా తాను చేసిన పెయింటింగ్ కు సుమారు రూ.250 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అనుకున్నాడు. కానీ దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్ పెయింటర్ జెఫ్రీ వేసిన క్యాన్వాస్ ను రూ.450 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాడు. అయితే జెఫ్రీ ఆశించిన దానికంటే డబుల్ మొత్తం పలకడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషంతో పొంగిపోయాడు. పెయింటింగ్ ద్వారా వచ్చిన డబ్బును చిన్న పిల్లల కోసం ఖర్చు చేస్తానని జెఫ్రీ తెలపడం విశేషం.