ఆర్ఆర్ఆర్ పై మరోసారి ఓంబిర్లాకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు…!
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈరోజు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరారు.
అయితే ఈ సందర్భంగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీలు.. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందించామని.. రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని వివరించారు. అలాగే.. రఘురామపై కేసులు, అరెస్ట్‌లు, బెయిల్ తర్వాత వరుసగా సీఎంలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తూ వచ్చిన రఘురామ.. తాజాగా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసిన విషయం తెలిసిందే.