అస్సాంలో విజయం కోసం బీజేపీ రసవత్తర యుద్ధం..
దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల విజయం కోసం అన్ని పార్టీలు వారి వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో పాగాకోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. అస్సాం అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 27వ తేదీన తొలిదశ ఎన్నికలు జరగనుండగా… మిగతా రెండు దశలు ఏప్రిల్ నెలలో పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. అస్సాంలో బీజేపీ విజయం సాధించడానికి చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. ఛత్తీస్ గడ్ లో ఏ విధంగా అయితే సైలెంట్ గా విజయం సాధించిందో అదే విధంగా అస్సాంలో కూడా అధికారంలోకి రావడాలని తీవ్రంగా శ్రమిస్తుంది.
అస్సాంలో ఉన్న మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు రెడీ అయింది. బీజేపీ 92 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షం అస్సాం గణ పరిషద్ 26 స్థానాల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంది. మిగతా స్థానాల్లో చిన్న పార్టీలు పోటీ చేస్తుండటం విశేషం. ఎన్నికల ముందు వరకు బీజేపీతో కలిసి పనిచేసిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఈసారి బయటకు వచ్చి కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు రెడీ అయింది. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీ నెగ్గలేదని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ స్పష్టం చేయడంతో బీజేపీ మరింత పావులు కదుపూ పలు రకాలుగా ప్రచారం ముమ్మరం చేసింది. ఏ విధంగానైనా సరే అస్సాంలో విజయ ఢంకా మోగించాలని బీజేపీ యత్నిస్తుంది. కాగా మూడు విడతలుగా జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే.