అరెస్ట్ లకు ఇదా సమయం : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని వెల్లడించారు.
అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందని.. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు. కాగా ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉందని పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు. మొత్తానికి సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడం అంటే ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి ఇన్నాళ్లు పాటు రెచ్చకొట్టిన విపక్ష నేతలు ఇప్పుడు అరెస్ట్ ఖండించడం సిగ్గు చేటు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇలాంటి సమయంలో ఏపీ హైకోర్ట్ లో రఘురామ తరఫు లాయర్లు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఈరోజు అందరికీ ఆసక్తి నెలకొంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.